‘‘సినిమా ఇండస్ట్రీలో వయసు పెద్ద సమస్య కాదని, సీనియర్ నటీమణులకు ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవహరించాలి’’ అని నటి మనీషా కొయిరాలా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ— ‘‘హీరోల వయసు గురించి ఎవరూ ప్రశ్నించరు. కానీ, నటీమణుల వయసు పైనే ఎక్కువగా కామెంట్స్ చేస్తారు. ఇది సినిమా పరిశ్రమలోనే కాదు, సమాజంలోనే ఉన్న సమస్య’’ అన్నారు.
తల్లి లేదా సోదరి పాత్రలకే సీనియర్ నటీమణులను పరిమితం చేయడం సరైనదేమీ కాదని, వారు యాక్షన్ పాత్రలు కూడా చేయగలరని మనీషా స్పష్టం చేశారు. ‘‘గతంలో అనేక సీనియర్ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేనూ కొత్త కథలతో నన్ను నేను సవాల్ చేస్తున్నా. వయసు కేవలం నంబర్ మాత్రమే. 50 ఏళ్లు దాటినా సంతోషంగా, సంతృప్తిగా జీవించగలం. ఈ విషయం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా చెప్పాలి’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.






