- వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో భోజనం
- తన బిడ్డలను కోల్పోయిన బాధను విద్యార్థులతో పంచుకున్న వీసీ
ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసన్న శ్రీ విద్యార్థులతో మమేకమయ్యారు. ఇటీవలే ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, గదులను పరిశీలించి, భోజనం రుచిగా, శుచిగా ఉండాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల మధ్య కూర్చొని భోజనం చేసిన ఆమె, విద్యార్థినులకు స్వయంగా గోరుముద్దలు తినిపించి తల్లి ప్రేమను చాటుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొని, ఎలాంటి ఇబ్బందులైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తన బిడ్డలను గుర్తుచేసుకుని భావోద్వేగం
విద్యార్థులతో మాట్లాడుతూనే తన కుమారులు తేజ్ నయన్ (1989), సిద్ధార్థ్ (2010) మరణాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ కాలేజీ స్థాపించాలని కలగన్నాడని, ఇప్పుడు విద్యార్థులను తన బిడ్డలుగా భావిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, రోడ్లపై ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అమ్మ మనసు కష్టపెట్టొద్దని, బాధ్యతగా నడుచుకోవాలని హితబోధ చేశారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి శ్రీకాంత్ జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆ విద్యార్థి మరణాన్ని గుర్తుచేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. తాను కోల్పోయిన తన ఇద్దరు పిల్లల బాధను విద్యార్థులతో పంచుకున్నారు.





