- ఏపీకి రైల్వే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు.
- ఏఐ సెంటర్, డేటా సిటీ, ఎలక్ట్రానిక్ కంపెనీల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh).. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్.. రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందించమని కోరారు. ఏఐ (AI) విప్లవం నేపథ్యంలో ఏపీలో ఏఐ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతులను వేగంగా మంజూరు చేసే విధానాన్ని అవలంభిస్తుందని, రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్ తెలిపారు. కేంద్రం నుంచి మరింత సహాయ సహకారాలు అందిస్తే, టెక్నాలజీ రంగంలో ఏపీ దూసుకుపోతుందని స్పష్టం చేశారు.
ఏపీ అభివృద్ధికి సమష్టి కృషి
ఈ సందర్భంగా లోకేశ్.. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మలతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడటంలో ఐక్యంగా కృషి చేసిన విధానం భవిష్యత్తులోనూ కొనసాగించాలి అన్నారు. విశాఖ రైల్వేజోన్, అమరావతి అభివృద్ధి, పోలవరంకు నిధులు కేటాయింపుల కోసం అహర్నిశ కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని లోకేశ్ అభినందించారు.





