- స్పేస్‌స్టేషన్‌లో ఎనిమిది నెలలుగా చిక్కుకుపోయిన సునీత, విల్మోర్
- మార్చి 19న ‘ఎండేవర్’ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు చేరుకునే అవకాశాలు
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎంతో త్వరలోనే భూమ్మీదకు రానున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లో ఉండిపోయిన వీరిని తిరిగి రప్పించే ప్రక్రియ వేగవంతం అవుతోంది. NASA తొలుత మార్చి 25న ‘క్రూ-10’ మిషన్‌ను నిర్వహించాలని భావించగా, ఇప్పుడు దానిని ముందుకు జరిపి మార్చి 12నే ప్రయోగం చేపట్టనున్నట్లు ధృవీకరించింది. ఈ ప్రయోగంలో స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా నలుగురు క్రూ-10 వ్యోమగాములను ISSకి పంపించనున్నారు. వారంతట అక్కడికి చేరుకున్నాక, క్రూ-9 మిషన్‌లో భాగంగా వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ ద్వారా భూమ్మీదకు రప్పించనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి 19న వీరిద్దరూ భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి. గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ-9 మిషన్‌లో సునీత సహా నలుగురు వ్యోమగాములు ISSకి వెళ్లారు. అయితే, స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే భూమ్మీదకు తిరిగి వచ్చారు. సునీత, విల్మోర్లకు ISSలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు వీరిని భూమ్మీదకు తీసుకురావడానికి మార్గం సుగమం అయింది.





