సంప్రదాయాల్ని బ్రేక్ చేస్తూ.. ఆధునికత వైపు మారుతున్న సమాజంలో ప్రతీదీ సెలబ్రేషనే. అందులో విడాకులు కూడా వచ్చి చేరాయి. ఎందుకంటే నేటి తరంలో విడాకులపై ఉన్న దృక్పథం వేగంగా మారుతోంది. పెళ్లి వంటి శుభకార్యాన్ని ఘనంగా జరుపుకుంటున్నామో.. విడాకులను కూడా ఓ కొత్త ప్రారంభంగా భావిస్తూ వేడుకలు నిర్వహించడం అనేక నగరాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఝార్ఖండ్‌లో ఓ తండ్రి తన విడాకులు పొందిన కూతురిని బ్యాండ్ మేళాలతో ఇంటికి ఆహ్వానించి, బంధుమిత్రులకు ఘన విందు ఏర్పాటు చేయడం.. అంతేనా.. హరియాణాలో ఓ వ్యక్తి తన భార్యతో విడిపోయిన తర్వాత ఆమె ప్రతిరూపాన్ని బొమ్మ రూపంలో తయారు చేయించి స్నేహితులతో గ్రాండ్ పార్టీ చేయడం ఈ మారుతున్న సమాజాన్ని ప్రతిబింబిస్తున్న సంఘటనలుగా నిలిచాయి.
విడాకులను బాధగా కాదు, జీవితంలో కొత్త ఆరంభం అని భావించడమే ఈ ట్రెండ్ వెనుక ఉన్న ఆలోచన. ప్రత్యేకంగా ‘డైవోర్స్ పార్టీలు’ ఏర్పాటు చేసి, పాత సంబంధాల నుంచి బయటపడి కొత్తగా జీవితాన్ని ప్రారంభించేందుకు నడుం బిగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సంస్కృతి వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. మనసు కలవకపోవడం, సంబంధం సజావుగా సాగకపోవడం వంటి కారణాలతో విడిపోయే జంటలు, విడాకులను జీవితంలోని మరో దశగా చూస్తున్నారు. కొత్త ఆరంభాన్ని వేడుకగా జరుపుకుంటూ మానసిక ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా వేడుకలు నిర్వహిస్తున్నారు.





