- అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్రలు చేయొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి.
- త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ (NTR) కృతజ్ఞతలు తెలిపారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న వారి ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నా, కానీ వారు పాదయాత్రల్లాంటి కష్టసాధ్యమైన ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల సంక్షేమమే తనకు ముఖ్యమని, వారిని కలుసుకోవడానికి ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఈ సమావేశానికి సంబంధించి పోలీసుల అనుమతులు, భద్రతా ఏర్పాట్ల కోసం సమన్వయం చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. దీనికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అభిమానులు ఓపికగా ఉండాలని కోరారు. ఇటీవల కుప్పం నుంచి వచ్చిన పలువురు ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
సినిమాల విషయానికి వస్తే…
‘దేవర’ విజయంతో మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఇదిలా ఉంటే, ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనికి ‘ఎంటర్ ది డ్రాగన్’, ‘ఎన్టీఆర్ ది డ్రాగన్’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.





