కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వైద్యం, విద్య, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, నిరుద్యోగం భారీగా పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఏఐ రాకతో జ్ఞానం ఉచితంగా అందుబాటులోకి వస్తుంది, కానీ ఉద్యోగాల సంగతేంటి? వారానికి రెండు, మూడు రోజులైనా పని చేయగలమా?” అని బిల్ గేట్స్ ప్రశ్నించారు.
బిల్ గేట్స్ మాట్లాడుతూ, ఏఐ వైద్య సలహాలు, విద్యా క్లాస్‌లను సులభతరం చేస్తుందని, కొత్త ఆవిష్కరణలతో పనులు వేగవంతమవుతున్నాయని చెప్పారు. అయితే, ఉద్యోగాల కొరత ఒక భయానక సమస్యగా మారవచ్చని హెచ్చరించారు. ఒబామా మాట్లాడుతూ, ఏఐ అడ్వాన్స్‌డ్ ఆటోమేషన్‌గా మారి, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు చేసే 70% పనులను స్వీకరిస్తోందని, ఇది వందేళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగ సంక్షోభానికి దారితీస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు “మనిషి ప్రతిభను మెషిన్లు భర్తీ చేయడం సరైందేనా?” అని ప్రశ్నిస్తూ, ఏఐ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





