- 2027 నుంచి స్టంట్ డిజైన్ విభాగంలో అవార్డులు ప్రదానం.
- ఆస్కార్ పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రత్యేక స్థానం.
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో కొత్తగా ‘స్టంట్ డిజైన్’ కేటగిరీని చేర్చారు. 2027 నుంచి విడుదలయ్యే సినిమాల్లోని స్టంట్ డిజైన్‌కు ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. సినిమా ప్రారంభం నుంచి స్టంట్ డిజైన్ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఈ విభాగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులను గౌరవించడం గర్వంగా ఉందని అకాడమీ నిర్వాహకులు తెలిపారు. 100వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ కేటగిరీని అధికారికంగా ప్రారంభించనున్నారు.
‘ఆర్ఆర్ఆర్’కు దక్కిన గౌరవం
ఆస్కార్ కొత్త కేటగిరీని ప్రకటించేందుకు విడుదల చేసిన పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రత్యేక స్థానం కల్పించారు. హాలీవుడ్ చిత్రాల సరసన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చేర్చడం విశేషం. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాల్లోని స్టంట్ల ఇమేజ్‌లతో ఈ పోస్టర్‌ను రూపొందించారు. దీనిపై తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవమని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. 100 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని, స్టంట్ డిజైన్ కేటగిరీని ప్రవేశపెట్టినందుకు రాజమౌళి అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ చూసి ఎంతో సంతోషమేసిందని ఆయన పేర్కొన్నారు.





