- పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి కేసులో ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది.
- వీరు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు తేలింది.
పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు NIA ప్రకటించింది.
ఉగ్రవాదులకు సహాయం.. పాకిస్థానీయులేనని వెల్లడి
అరెస్ట్ అయిన వారిలో పర్వేజ్ అహ్మద్ జోతర్ (బత్కోట్ నివాసి) మరియు బషీర్ అహ్మద్ జోతర్ (హిల్ పార్క్ నివాసి) ఉన్నారు. వీరిద్దరూ పహల్గామ్‌కు చెందినవారే. నిషేధిత పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT) కు చెందిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం, ఆహారం, ఇతర సహాయ సహకారాలు అందించినట్లు NIA ఒక ప్రకటనలో తెలిపింది. NIA దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. ఈ దాడి జరగడానికి ముందు, పర్వేజ్, బషీర్ ఆ ముగ్గురు ఉగ్రవాదులను హిల్ పార్క్ ప్రాంతంలోని ఒక తాత్కాలిక గుడిసె (ధోక్)లో దాచి ఉంచినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సందర్భంగా, పర్వేజ్, బషీర్ ఆ దాడి చేసిన వారి వివరాలను వెల్లడించడమే కాకుండా, వారు పాకిస్థాన్ జాతీయులే అని కూడా స్పష్టం చేశారు.
మతపరమైన గుర్తింపు ఆధారంగానే దాడి
ఉగ్రవాదులు బైసరన్ లోయలో పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని, వారి మతపరమైన గుర్తింపు ఆధారంగానే దాడి చేసినట్లు NIA తెలిపింది. ఈ ఘటన గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. అరెస్ట్ అయిన ఇద్దరిపైనా అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద కేసులు నమోదు చేశారు. ఈ దాడి వెనుక ఉన్న పెద్ద కుట్రపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు.





