- పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- 10 వేల మందికి పదోన్నతులు , ఇకపై బదిలీలకు రేట్లు పెట్టే పద్ధతి పూర్తిగా ఉండదని స్పస్టీకరణ
‘పల్లెలే దేశానికి వెన్నెముక’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు తమ శాఖాపరమైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను” అని చెప్పారు. పదే పదే సమీక్షలు నిర్వహించి, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ‘గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు, బదిలీకి ఓ రేటు పెట్టారు. ఈ పద్ధతిని పూర్తిగా నిర్మూలించాలని అధికారులకు చెప్పాను’ అని ఆయన స్పష్టం చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
10 వేల మందికి పదోన్నతి
పంచాయతీరాజ్ అనుబంధ శాఖల్లో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 10 వేల మందికి పదోన్నతులు కల్పించామని పవన్ కల్యాణ్ తెలిపారు. సీనియారిటీ, సిన్సియారిటీ, పనితీరు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సులు కూడా ఈ పరిధిలో ఉంటేనే చెప్పాలని సూచించానని అన్నారు. ‘పదోన్నతి వచ్చిన ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నా తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగే. అందుకే ఉద్యోగులపై సానుకూల భావన ఉంది’ అని ఆయన అన్నారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరగాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలని, దానిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.





