- యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు విఘాతం కలగడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన.
- సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకూడదని, భద్రతే ప్రాధాన్యమని స్పష్టీకరణ.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా.. పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపిస్తున్న తరుణంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంక్షోభ నివారణకు దౌత్యపరమైన అడుగులు వేశారు. (PM Modi call to Iran President Masoud Pezeshkian West Asia War)
నేడు (మార్చి 21, 2026) ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఈద్ మరియు నౌరోజ్ శుభాకాంక్షలు తెలుపుతూనే.. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు (Freedom of Navigation) సురక్షితంగా ఉండాలని, అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలగకుండా చూడాలని మోదీ నొక్కి చెప్పారు. రక్షణ మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.
భారతీయ పౌరుల భద్రత – మోదీ భరోసా
యుద్ధం తీవ్ర రూపం దాల్చిన ఫిబ్రవరి 28 నుండి మోదీ, పెజెష్కియాన్ మధ్య జరిగిన రెండో సంభాషణ ఇది. ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రత విషయంలో ఇరాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మోదీ అభినందించారు. యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా గొలుసు (Global Supply Chain) దెబ్బతినకుండా ఉండేందుకు చర్చలు, దౌత్యమే సరైన మార్గమని భారత్ తన పాత స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేసింది.





