- ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్‌గా మారారని సీఎం రేవంత్ ఆరోపణ
- కేంద్రాన్ని సవాల్ చేసిన రేవంత్, కులగణన సర్వే చేయాలని డిమాండ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన లీగల్‌గా బీసీగా మారారని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ, “సర్టిఫికెట్లలో మోదీ బీసీ అయినా, ఆయన మనసంతా బీసీ వ్యతిరేకమే. మోదీ తొలిసారి గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో చేర్చారు. ఇది నిజమా కాదా కేంద్రం సమాధానం చెప్పాలి” అని సవాల్ విసిరారు.
కులగణనపై డిమాండ్
ఈ సందర్భంగా రేవంత్ కులగణనపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. “జనగణనలో కులగణన కూడా చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వం చేసిన లెక్కలతో కేంద్ర లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను బహిష్కరించాలి” అంటూ రేవంత్ తెగబడ్డారు. అలాగే, యూత్ కాంగ్రెస్ నేతల సేవలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల్లో ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి, “డబ్బుతో రాజకీయాలు సాధ్యం కాదు. పదేళ్లు ప్రజలను మోసగించిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని విమర్శించారు.





