
దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తన ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా ఎప్పుడూ విభిన్న అంశాలను పంచుకుంటూ, సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతుంటారు. తాజాగా, ఇల్లులేని వారికి సహాయపడే ఏంజెలా లూనా డిజైన్ చేసిన ‘జాకెంట్’ (Jackent) గురించి పూరి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘‘జాకెంట్’’ – శరణార్థులకు ఆశాకిరణం
పూరి మాట్లాడుతూ, ‘‘ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆకలితో ఇల్లులేని జీవితాలను గడుపుతున్న లక్షలమంది ప్రజలు ఉన్నారు. శరణార్థుల పరిస్థితులు వర్ణనాతీతం. అలాంటి వారికి ఇల్లులేని కారణంగా చలి, మంచుకి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా డిజైనర్ ఏంజెలా లూనా ‘జాకెంట్’ అనే వినూత్న డిజైన్ సృష్టించారు. జాకెట్‌గా ధరించే ఈ డిజైన్ అవసరమైనప్పుడు టెంట్‌గా మారిపోతుంది. ముఖ్యంగా సిరియా శరణార్థులకు ఇది గొప్ప ఆశాకిరణమై నిలిచింది’’ అని తెలిపారు.

డిజైనర్లకు స్ఫూర్తిగా ‘జాకెంట్’
‘‘జాకెంట్ అనేది డబ్బు, స్టేటస్ కోసం తయారుచేసిన డిజైన్ కాదు. అది ప్రాణాలను కాపాడే డిజైన్. ఏంజెలా లూనా అందరి ప్రశంసలకు అర్హురాలు. ఇటువంటి ఉత్పత్తులు భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలి. ఇది అడక్కునేవాళ్లకు అందించగలిగితే, వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది’’ అని పూరి అన్నారు.





