- 16 గంటల పాటు కొనసాగిన రక్షణ చర్యలు ఫలితం లేకుండా పోయింది
- బోరుబావుల విషయంలో నిర్లక్ష్యం – మరణాలకు కారణం
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝలావర్ జిల్లాలోని పద్లా గ్రామంలో ఐదేళ్ల బాలుడు ప్రహ్లాద్ 250 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయి మరణించాడు. బోరుబావిని మూసివేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం పొలాల్లో ఆడుకుంటూ బాలుడు బోరుబావిలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు భారీ రక్షణ చర్యలు చేపట్టి, 16 గంటల పాటు ప్రయత్నించి బాలుడిని బయటకు తీశాయి. అయితే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రహ్లాద్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదే తొలిసారి కాదు, గతంలో కూడా రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రైతులు నిర్లక్ష్యంగా తెరిచి ఉంచిన బోరుబావుల వల్ల అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తెరిచి ఉన్న బోరుబావులను మూసివేయాలని ఆదేశించినప్పటికీ, రైతులు దానిని పాటించకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది.





