మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో రామ్‌చరణ్ ఫ్యాన్స్ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, దాదాపు 50 శాతం వరకు పూర్తయ్యిందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వెల్లడించారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ కొత్త లుక్‌తో కనిపించనున్నారు. పాత్ర కోసం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు.
కొత్త స్టైల్, యాక్సెంట్
ఈ సినిమాలో రామ్‌చరణ్ బల్కీ బాడీతో పాటు మాస్ లుక్‌లో కనిపిస్తారని రత్నవేలు చెప్పారు. మీసం, గడ్డం, ముక్కు రింగ్‌తో ప్రత్యేకమైన స్టైల్‌లో కనిపించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా, ఆయన డైలాగ్ డెలివరీలో కూడా కొత్త యాక్సెంట్‌ను ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బుచ్చి బాబు రాసిన కథ అద్భుతంగా ఉందని, ఇది ‘రంగస్థలం’ నుంచి కొంత ప్రేరణ తీసుకున్నప్పటికీ, కథ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుందని రత్నవేలు స్పష్టం చేశారు.
సినిమా విశేషాలు
‘పెద్ది’ సినిమా గ్రామీణ వాతావరణంలో, క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, దివ్యేందు, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, మైసూరు సహా పలు ప్రదేశాల్లో షూటింగ్ కొనసాగుతోంది.
భారీ డీల్స్.. విడుదల తేదీ
ఇటీవల మైసూరులో భారీ సాంగ్‌ను చిత్రీకరించారు. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు రూ. 100 కోట్లకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భారీ యాక్షన్ డ్రామా 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.





