- బ్యాంక్.ఇన్ డొమైన్ ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
- డిజిటల్ లావాదేవీల భద్రతను మెరుగుపరిచే చర్యలు
ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగులు వేస్తోంది. బ్యాంకులకు మద్దతుగా బ్యాంక్.ఇన్ (bank.in) డొమైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. 2025 ఏప్రిల్ నుంచి ఇది బ్యాంకులకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఖాతాదారులు నిజమైన బ్యాంకింగ్ వెబ్సైట్లు, మోసపూరిత వెబ్సైట్ల మధ్య తేడాను సులభంగా గుర్తించగలుగుతారని తెలిపారు. తదుపరి ఫిన్.ఇన్ (fin.in) డొమైన్‌ను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
డిజిటల్ లావాదేవీల భద్రత మరింత కఠినతరం
ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఆర్థిక సంస్థలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని మల్హోత్రా అన్నారు. డిజిటల్ చెల్లింపుల ధ్రువీకరణ మరింత కఠినతరం కానుంది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలకు అదనపు భద్రతా ప్రమాణాలు అమలులో ఉండగా, త్వరలో దేశం నుంచి విదేశాలకు చేసే చెల్లింపులకు కూడా వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో రిటైల్ వినియోగదారుల పాత్రను పెంచే లక్ష్యంగా ఎన్డీఎస్-ఓఎం (NDS-OM) వేదికను విస్తరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇకపై సెబీ వద్ద రిజిస్టర్ అయిన నాన్-బ్యాంక్ బ్రోకర్లు, ఎన్బీఎఫ్సీలు (NBFCs) కూడా ఇందులో ట్రేడింగ్ చేసే వీలుంటుంది. ఈ నిర్ణయంతో బాండ్ల మార్కెట్ విస్తరించే అవకాశం ఉంది.





