మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 16’ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన పోస్ట్ ఆ ఊహాగానాలకు బలం చేకూర్చింది.
రత్నవేలు పోస్టుతో హైప్!
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా షేర్ చేసిన ఓ ఫొటోలో నైట్ షూటింగ్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్ వంటి హింట్స్ కనిపించాయి. క్రికెట్ స్టేడియంలో ఉండే లైట్‌లను హైలైట్ చేస్తూ ఆయన చేసిన పోస్టు, ఈ సినిమా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందనే ఊహాగానాలను మరింత పెంచింది. అంతేకాదు, గతంలోనూ ఈ సినిమా గురించి రత్నవేలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సహజత్వం కోసం కొన్ని సీక్వెన్స్‌లను నెగటివ్ ఫిల్మ్ రీల్‌తో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందని, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోందని తెలుస్తోంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.





