స్ట్రీట్ హరాస్మెంట్ (బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు)పై అవగాహన కల్పించేలా ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు పురుషులను వేధించినట్టుగా రివర్స్ సినారియోలో రూపొందించిన ఈ వీడియో, ‘‘మీకు ఇష్టం లేనిది ఇతరులకు చేయకండి’’ అనే శక్తివంతమైన సందేశాన్ని ఇస్తోంది.
ఈ వీడియోలో మహిళలు పురుషుల భుజాలు తాకడం, రైలులో వారి భుజంపై తల వాల్చడం, అసభ్యంగా తాకడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. ఈ చర్యల వల్ల పురుషులు ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు చూపించారు. వీడియో చివరలో, పురుషులు మహిళలతో మాట్లాడుతూ ఇలాంటి పనులు ఎంత అనుచితమో వివరిస్తారు. ఇది అర్థం చేసుకున్న మహిళలు తమ తప్పును తెలుసుకుని మారుతారు.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రశంసలు
మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ దీపిక భరద్వాజ్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘అద్భుతమైన వీడియో, సందేశం, మరియు చర్య. మీకు ఇష్టం లేనిది ఇతరులకు చేయకండి. అందరూ మహిళల వేధింపులకు వ్యతిరేకంగా నిలబడితే బహిరంగ ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయి’’ అని ఆమె క్యాప్షన్ రాశారు. ఈ పోస్ట్‌కు లక్షల వ్యూస్, వేల లైక్‌లు, రీపోస్టులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంలో అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత కోసం అందరూ కలిసి పనిచేయాలని, ఇలాంటి మంచి ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.





