సమంత (Samantha) – రాజ్ నిడిమోరు (Raj Nidimoru) వివాహం ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఈ వేడుకకు అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి హంగామా లేకుండా, ఆధ్యాత్మికతతో సాగిన ఈ వివాహం గురించి తాజాగా రాజ్ పిన్ని, ప్రముఖ గాయని శోభారాజు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే భయమేసింది!’
“సమంత చాలా క్రమశిక్షణతో జీవించే అమ్మాయి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. మూడు నెలలకోసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందని విన్నా, తర్వాత నిజంగానే చూసాను. సన్నగా ఉన్న సమంత పక్కన కూర్చోవాలంటే భయమేసింది, ఆమె చెప్పిన డైట్ ఫాలో చేయాలంటే కష్టమే!” అంటూ శోభారాజు నవ్వుతూ చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలతో గుర్తింపు పొందిన శోభారాజు, రాజ్ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారు. “రాజ్ చిన్నప్పుడు భక్తి పాటలు పాడేవాడు. ఆహారం, వ్యాయామం, ధ్యానం అన్నింటిలోనూ క్రమశిక్షణ అతని బ్లడ్‌లోనే ఉంది. రాజ్ జీవితంలోకి ఆధ్యాత్మిక ఆలోచనలున్న సమంత రావడం మా కుటుంబానికి సంతోషం” అని చెప్పారు.
సాత్వికాహారం – సహజ పరిమళాలు
వివాహ పద్ధతిలో ‘క్లేశ నాశన’ అనే భాగం ఉందని ఆమె తెలిపారు. వేడుకలో సాత్వికాహారం మాత్రమే వడ్డించారని,
అతిథులకు సహజ పరిమళాల (Natural Perfumes) గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పారు. “పెళ్లి దుస్తుల్లో సమంత చాలా అందంగా కనిపించింది. ఆమె సింప్లిసిటీ, గ్రేస్ రెండూ కలిపి ఉన్నాయని” అన్నారు శోభారాజు.
వెబ్‌సిరీస్ సక్సెస్ పార్టీకి హాజరైన రాజ్
వివాహం అనంతరం రాజ్ ముంబయిలో జరిగిన ‘ది ఫ్యామిలీ మాన్ 3’ వెబ్‌సిరీస్ సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. డైరెక్టర్ డీకే, నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి కనిపించారు. ఫొటోగ్రాఫర్లు శుభాకాంక్షలు తెలుపుతుండగా రాజ్ చిరునవ్వుతో స్పందించారు. ఇక సమంత కూడా కొత్త జోష్‌లో ఉంది. డిసెంబర్ 1న వివాహం జరగగా, డిసెంబర్ 5న ఆమె ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెరకెక్కిస్తుండగా, నిర్మాతగా కూడా సమంతనే వ్యవహరిస్తున్నారు.





