- హీరో లేకుండా సినిమా తీస్తానని సవాల్ చేసిన సందీప్ వంగా.
- విమర్శలకు తనదైన శైలిలో సమాధానం.
సందీప్ వంగా సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారీ దర్శకుడు. సాధారణంగా సందీప్ వంగా సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ‘యానిమల్’లో స్త్రీని తక్కువ చేసి చూపించారని కొందరు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తంచేశారు. తాజాగా ఈ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు హీరో లేకుండా సినిమా తీస్తానని చెప్పారు.
సవాల్ విసిరిన సందీప్ వంగా
ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ తన సినిమాలపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేదంటే హీరో లేకుండా తీస్తారా?. రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోండి’ అని అడిగారు. దానికి సందీప్ వెంటనే సమాధానమిచ్చారు. ‘‘హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచన. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే.. నా చిత్రాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా ‘5 ఏళ్ల క్రితం సందీప్ చెప్పింది. చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు’’ అని చెప్పారు.
ప్రభాస్ తో స్పిరిట్ సినిమా
ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్ (Prabhas) ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ.. దీని రికార్డులు బాహుబలిని దాటాలని లేదన్నారు. రూ.2000 కోట్లు అనేది చాలా పెద్ద విషయమన్నారు. ఇదైతే మంచి సినిమా అని చెప్పారు. ఎంత వసూళ్లు సాధిస్తుందనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందన్నారు.





