ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయసాయిరెడ్డితో భేటీకి సంబంధించిన కీలక వివరాలు బయటపెట్టారు. ఈ సమావేశంలో జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ నేత షర్మిలను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి మూడున్నర గంటలపాటు చర్చించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన విజయసాయి, షర్మిలను కలవడంపై వైసీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి సంబంధించిన విశేషాలను తాజాగా షర్మిల స్వయంగా వెల్లడించారు.
“జగన్ ఎంతగా దిగజారిపోయారో తెలిసి మనసు ముక్కలైంది!!”
“విజయసాయిరెడ్డితో చాలా విషయాలు మాట్లాడాం. నాకు, నా తల్లికి వ్యతిరేకంగా కేసులు పెట్టించి, నా పిల్లల హక్కులను హరిస్తూ జగన్ చేసిన కుట్రలు ఆయన చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాలో, ఎలా అబద్ధం చెప్పాలో స్వయంగా డిక్టేట్ చేశారట. విజయసాయిరెడ్డిని ఒత్తిడి చేసి, అబద్ధపు ప్రకటన చేయాలని బలవంతం చేశారు. నా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించారో.. స్వంత చెల్లి మీద కూడా ఇంతటి కుట్రలు పన్నేలా?” అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కిన జగన్, మద్యనిషేధం పేరుతో మద్యం అమ్మకాలను పెంచారని విమర్శించారు. తన పిల్లల ఆస్తుల కోసం కుట్రలు పన్నిన జగన్ నైతికత గురించి మాట్లాడటమే అసహ్యంగా ఉందని మండిపడ్డారు.





