కారు సన్‌రూఫ్‌లోంచి తల బయటపెట్టి ప్రయాణించే పిల్లలను మనం తరచుగా చూస్తుంటాం. ఇది సరదా కోసం చేసినా, ఎంత ప్రమాదమో తెలియజేసే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్లపై జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక.
ఈ వైరల్ వీడియోలో, ఒక ఎర్ర కారు రోడ్డుపై వెళ్తుండగా దాని సన్‌రూఫ్ నుంచి ఒక చిన్న పిల్లవాడు తల బయటపెట్టి ఉన్నాడు. ఆ రోడ్డుపై ఉన్న ఒక తక్కువ ఎత్తు బార్‌ను దాటుతున్న సమయంలో పిల్లవాడి తల దానికి బలంగా తగిలింది. ఆ షాక్‌కు తట్టుకోలేక పిల్లవాడు కారులో వెనక్కి పడిపోయాడు. డ్యాష్‌క్యామ్‌లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చర్చ
“మీ పిల్లలు తలలు బయట పెట్టినప్పుడు మరోసారి ఆలోచించండి!” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి. తల్లిదండ్రులు, రోడ్డు భద్రతపై ఆందోళన ఉన్న నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సన్ రూఫ్ సరదా కోసం కాదు, అది ప్రమాదాలకు కారణమవుతుందని ఈ ఘటన రుజువు చేసింది. పిల్లలు సన్‌రూఫ్‌లోంచి బయటికి వస్తే, రోడ్డుపై ఉండే తక్కువ ఎత్తు బార్‌లు, చెట్ల కొమ్మలు, లేదా ఇతర అడ్డంకులకు తగిలి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. భారతదేశంలో సన్‌రూఫ్ ఒక అనవసర ఫీచర్‌గా కొంతమంది భావిస్తున్నప్పటికీ, పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేయకుండా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలని ఈ వీడియో తల్లిదండ్రులకు ఒక గుణపాఠంగా మారింది.





