
సినిమా రంగంలో వారసుల ప్రవేశం చాలా సాధారణం. తరతరాలుగా నటీనటుల కుటుంబాలు తమ వారసులను కూడా ఈ రంగంలోకి ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే, ఈ మధ్య తమిళ నటుడు, దర్శకుడు పొన్వన్నన్ మరియు ప్రముఖ నటి శరణ్య దంపతులు తీసుకున్న ప్రత్యేకమైన నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
శరణ్య, మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ‘నాయకన్’ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు. అమాయకమైన యువతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఆ తర్వాత ఎన్నో తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో అక్కగా, అమ్మగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలో ధనుష్ తల్లిగా ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువైంది. ఇక పొన్వన్నన్, నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ పలు చిత్రాలకు పని చేశారు. ఈ దంపతులు సినిమా రంగంలో మంచి హోదాను సంపాదించారు. కానీ, ఈ రంగంలో ఇంతటి గుర్తింపును పొందిన వారు, తమ ఇద్దరు కూతుళ్లను మాత్రం పూర్తిగా సినిమాలకు దూరంగా పెంచి, వైద్య రంగంలో రాణించేందుకు ప్రోత్సహించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇద్దరూ డాక్టర్లే
పొన్వన్నన్, శరణ్య దంపతులకు చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు కూతుళ్లు. చూడటానికి హీరోయిన్స్‌లా ఉండే వీరిద్దరూ వైద్యవిద్యను అభ్యసించారు. చాందిని, గతేడాది ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రియదర్శిని, ఇటీవల శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పట్టభద్రురాలై డాక్టర్గా మారింది. ప్రియదర్శిని పట్టభద్రుల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినీ రంగానికి చెందిన వారు, తమ వారసులను వైద్యులుగా తీర్చిదిద్దడం చాలా అరుదైన విషయం.





