వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు: తెదేపా కార్యకర్త అరెస్ట్, పార్టీ నుంచి సస్పెన్షన్!

  • వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్ అరెస్ట్.
  • కిరణ్‌కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెదేపా అధిష్ఠానం.

వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వై.ఎస్. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వై.ఎస్. భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను తెదేపా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్‌కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు తరలించారు. శుక్రవారం ఉదయం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసు

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. జగన్ సతీమణి భారతి, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ తెదేపా కార్యకర్త అయినప్పటికీ కూడా ఉపేక్షించలేదు. దాన్ని తీవ్రంగా పరిగణించి ఆఘమేఘాలపై చర్యలు చేపట్టింది. నిందితుడు కిరణ్‌కుమార్‌పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం (బీఎన్‌ఎస్ 79), వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించడం (బీఎన్‌ఎస్ 196(1)), అనుచిత వ్యాఖ్యలు (బీఎన్‌ఎస్ 353(1)), నేరపూరిత కుట్ర (బీఎన్‌ఎస్ 61 (2)), వ్యవస్థీకృత నేరం (బీఎన్‌ఎస్ 111(1)), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఏ) వంటి బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ కిరణ్‌కుమార్ ఒక వీడియో విడుదల చేశారు. ‘వై.ఎస్. భారతిగారు నన్ను క్షమించండి. మహిళలు అంటే నాకు గౌరవం ఉంది. నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్లు పట్టుకుంటూ క్షమాపణలు కోరుతున్నా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *