తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కలిసి జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రూ.55,652 కోట్ల ఆర్థిక సాయం అవసరమని వివరించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, సరస్సుల పునరుజ్జీవం వంటి ప్రాజెక్టుల గురించి వివరించారు.
ప్రధాన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అభ్యర్థన
20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, 110 కిలోమీటర్ల మూసీ రివర్ ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు కోసం రూ.4,170 కోట్లు, హైదరాబాద్ సమీపంలోని పట్టణ ప్రాంతాల మురుగునీటి ప్రణాళిక కోసం రూ.17,212 కోట్లు మంజూరు చేయాలని సూచించారు. పీఎం కుసుమ్ పథకం కింద లక్ష సౌర పంపుల కేటాయింపుతో పాటు విద్యుత్ సరఫరా బలోపేతానికి రూ.488 కోట్ల వ్యయంతో నివేదికలు కేంద్రానికి సమర్పించినట్లు పేర్కొన్నారు.
కేంద్రం నుంచి పూర్తిసహకారంపై హామీ
కేంద్ర మంత్రి ఖట్టర్ తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌లో సాధించిన రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను అభినందించారు. ఈటల రాజేందర్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెట్రో విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.






