అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్నుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డ్ కార్డ్’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కార్డ్ ఫస్ట్ లుక్‌ను ఆయన ఇటీవల విడుదల చేశారు. దీని ద్వారా సంపన్నులకు నేరుగా అమెరికా పౌరసత్వం ఇస్తామని ట్రంప్ చెబుతున్నారు.
- 5 మిలియన్ డాలర్లతో గోల్డ్ కార్డ్: ఈ కార్డ్‌ను కొనాలంటే రూ.43.5 కోట్లు ఖర్చు చేయాలి. ట్రంప్ స్వయంగా మొదటి కార్డ్‌ను కొనుగోలు చేశారు.
- విపరీతమైన గిరాకీ: ఒక్క రోజులోనే 1000 కార్డులు అమ్ముడైనట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు.
ట్రంప్ ఈ కార్డ్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరుల ముందు ప్రదర్శించారు. దీనిపై ఆయన చిత్రం ఉంది. రెండు వారాల్లో ఈ కార్డ్ అమ్ముడైపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు అమెరికాలో ఖర్చు చేస్తే, స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈబీ-5 మోసాలకు చెక్.. గోల్డ్ కార్డ్‌తో కొత్త ఆలోచన
1990లో అమెరికా ప్రవేశపెట్టిన ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా విధానంలో మోసాలు జరుగుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించి, గోల్డ్ కార్డ్‌ను ప్రకటించారు. ఈ కార్డ్ ద్వారా చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం ఇస్తామని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలో 3.7 కోట్ల మంది ఈ కార్డ్ కొనే సామర్థ్యం ఉన్నవారున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా అక్రమాలను అరికట్టడంతో పాటు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.





