సత్యవర్థన్ బెదిరింపు కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో అధికార అండతో వ్యవహరించిన వంశీ, ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. పటమట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో హైదరాబాద్‌కు చేరుకున్న పోలీసు బృందం, రాయదుర్గంలోని ఆయన నివాసంలో అరెస్ట్‌కు పూనుకుంది. తెల్లవారుజామున ఇంటి తలుపు తట్టి, కేసు వివరాలు వివరించిన అనంతరం వంశీని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్‌కు ప్రతిఘటన, వాగ్వాదం
అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి వంశీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ చూపించిన తర్వాత వెనక్కి తగ్గారు. దుస్తులు మార్చుకోవడానికి గదిలోకి వెళ్లిన ఆయన, వైఎస్సార్సీపీ నేతలు, అనుకూల మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ఇంటివద్దకు రావాలని కోరారు. తన వాహనాన్ని అనుసరించేందుకు సూచించారు. సుమారు 40 నిమిషాల పాటు గదిలోనే గడిపిన వంశీ, ఎట్టకేలకు బయటకు వచ్చి పోలీసుల అదుపులోకి వెళ్లాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో విజయవాడ తరలించారు. విజయవాడ చేరుకున్న వెంటనే వంశీని పోలీసులు విచారించేందుకు కృష్ణలంక స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనపై కేసు పెట్టింది ఎవరో చెప్పాలని పోలీసులపై వంశీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ కొనసాగింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, వంశీతో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.





