- అపహరణ కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు చర్యలు
- కోర్టు అనుమతి తీసుకుని వంశీ ఫోన్ స్వాధీనం చేసుకునే యత్నం
సత్యవర్ధన్ అపహరణ, దాడి కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వంశీ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తూ, విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. హైదరాబాద్‌లో అరెస్టు సమయంలో వంశీ సెల్‌ఫోన్ దొరకలేదు. అయితే వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. వంశీ ఎక్కువగా వాట్సాప్ కాల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నారన్న అనుమానంతో ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్డ్ రికార్డ్స్) రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు అనుమతి లభించగానే హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. అరెస్టు అనంతరం వంశీని విజయవాడకు తరలించిన తర్వాత అల్పాహారం, భోజనం వద్దని నిరాకరించినట్టు తెలిసింది. దీని వెనుక ఆసుపత్రికి తరలించేలా చేయడమే ఉద్దేశ్యమంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించడంతో శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ జిల్లా కారాగారానికి తరలించారు. జైలు అధికారులు 7641 నంబరు కేటాయించి, మిగిలిన ఖైదీలతో కలపకుండా ప్రత్యేక సెల్‌లో ఉంచారు. మధ్యాహ్నం ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్‌లో కలిశారు.





