- బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన హర్ష సాయిపై కేసు నమోదు
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మందలింపు!
ప్రసిద్ధ యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడంపై ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో హర్ష సాయి వ్యాఖ్యలపై మండిపడుతూ “తప్పు చేస్తూ దానిని సమర్థించుకోవడం అర్థరహితం” అంటూ మందలించారు. హర్ష సాయి ఓ మీడియా ఇంటర్వ్యూలో “నేను ప్రమోట్ చేయకపోతే ఇంకెవరో చేస్తారు” అనే విధంగా మాట్లాడిన మాటలపై సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. “ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారు, జీవితాలు నాశనమవుతున్నాయి. డబ్బు కోసం సమాజానికి నష్టం కలిగించే పనులు చేయడం క్షమించలేనిది” అని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై గత కొన్ని నెలలుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్‌లపై కూడా కేసులు నమోదు కాగా, ఇంకా పలువురిపై విచారణ కొనసాగుతోంది.





