- వల్లభనేని వంశీ అరెస్ట్‌పై జగన్ తీవ్ర విమర్శలు
- కొఠారు అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసును తప్పుడు ఆరోపణగా ఖండించిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత
రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అధికార దుర్వినియోగం శృతి మించిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, న్యాయానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. “వంశీపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అన్యాయంగా వ్యవహరిస్తోంది. దళిత యువకుడు నిజాలను జడ్జి ముందు చెప్పినందుకు అతనిని బెదిరించడం, వేధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులో, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం తీవ్ర దుర్వినియోగం.” అని జగన్ ఆరోపించారు.
అబ్బయ్య చౌదరి కేసుపై కూడా మండిపడ్డ జగన్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ను టీడీపీ ఎమ్మెల్యే తిడితే, ప్రతిగా అబ్బయ్య చౌదరిపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. “వీడియోలో స్పష్టంగా కనిపిస్తుండగా, అసలు బాధితులపైనే 307 హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటీ?” అంటూ ప్రశ్నించారు. “ప్రజాస్వామ్యంలో ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ప్రజలను భయపెట్టలేరు. ప్రజలు మీ చర్యలను గమనిస్తున్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదు” అని జగన్ హెచ్చరించారు.





