ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడిపై మరోసారి విరుచుకుపడ్డారు. “సూపర్ సిక్స్” హామీలను గుర్తుచేస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్” అయిందంటూ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లుగా ఉందని, చంద్రబాబు ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం అని తెలిపారు. నీతి ఆయోగ్ రిపోర్ట్‌ను ముందుపెట్టి, డబ్బులు ఉంటేనే పథకాలు అమలు చేయాలని సూచిస్తున్నారని విమర్శించారు.షర్మిల, “50 లక్షల మంది అన్నదాతలను వంచించారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని” ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రం రూ. 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని మీరే చెప్పారు” అని గుర్తుచేశారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఈ ఆర్థిక పరిస్థితి తెలుసుకోలేదా? అని ప్రశ్నించారు. “పథకాలకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే, వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని ఆమె స్పష్టం చేశారు.






