- విజయవాడ స్పా సెంటర్లో దొరికిన మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు
- వీడియో లీక్‌పై పోలీసుల్ని బెదిరించిన నాయక్
స్పా సెంటర్లో మహిళతో దొరికిన వీడియోలు వైరల్ కావడంతో వైఎస్సార్సీపీ నేత వడిత్యా సోమశంకర్ నాయక్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఘటనపై స్పందిస్తూ ‘నా రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మీరే దీనికి బాధ్యులు’ అంటూ పోలీసులను బెదిరించిన ఆడియోలు బయటకొచ్చాయి. విజయవాడ వెటర్నరీ కాలనీలోని స్టూడియో 9 స్పా సెంటర్ పై ఇటీవల మాచవరం పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో ఈ దాడి నిర్వహించగా, అక్కడ వడిత్యా సోమశంకర్ నాయక్ మంచం కింద దాక్కుని ఉన్న వీడియోలు బయటపడ్డాయి. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఆయన పోలీసులను బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం.
రాజకీయంగా కక్షసాధింపు అంటున్న నాయక్
ఈ వివాదంపై సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ, ‘నా మీద కుట్ర చేశారు. రాజకీయంగా నన్ను ఇరికించారు’ అని సోమశంకర్ నాయక్ తెలిపారు. అయితే, ఈ వివాదం చుట్టూ రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.ఈ వివాదం పార్టీకి దుష్ప్రభావం కలిగించకూడదనే ఉద్దేశంతో వడిత్యా సోమశంకర్ నాయక్‌ను వైఎస్సార్సీపీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.





