ప్రపంచాన్ని కుదిపేస్తూ, సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ఆందోళనకు గురి చేస్తూ… దాదాపు 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్ అయ్యాయి. ఈ డేటా 30కి పైగా డేటాబేసుల నుంచి లభించిందని సైబర్ న్యూస్ రీసెర్చర్లు వెల్లడించారు. ఇది ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అతిపెద్ద పాస్‌వర్డ్ లీక్‌గా భావిస్తున్నారు. Facebook, Instagram, Gmail, Apple, GitHub, Telegram, VPNలు, అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్స్ వంటి కీలక సేవలకు చెందిన యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ లీక్ అయ్యాయి.
ఇవన్నీ ఎప్పుడో జరిగిన పాత హ్యాకింగ్ నుంచి వచ్చినవి కావు. తాజాగా స్టోలైన డేటాగా పేర్కొంటున్నారు. ఇది ‘ఇన్ఫోస్టీలర్ మాల్వేర్’ అనే వైరస్ వల్ల సంభవించిందని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ఓ వ్యక్తి డివైస్ లోకి ప్రవేశించి బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్లు, కుకీలు, టోకెన్లు అన్నీ దోచేస్తుంది. లీకైన డేటా అత్యంత ప్రమాదకరంగా ఉండేలా – దానిని వాడుకుని అకౌంట్లు హ్యాక్ చేయవచ్చు, గుర్తింపు దొంగతనాలు చేయవచ్చు, వ్యక్తిగత మెసేజ్‌లు, ఫొటోలు దోచేయవచ్చు.
ఈ నేపథ్యంలో నిపుణులు యూజర్లందరికీ వెంటనే పాస్‌వర్డ్లు మార్చాలని సూచిస్తున్నారు. ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్లు పెట్టాలి. మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరిగా వాడాలి. మీ డేటా లీక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ‘Have I Been Pwned’ వంటి వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ఒకవేళ డేటా లీక్ అయిందనిపిస్తే, సంబంధిత యాప్స్‌ను వెంటనే లాగ్ అవుట్ చేసి, సెక్యూరిటీ సెటింగ్స్ చెక్ చేయాలి. డిజిటల్ యుగంలో మన డేటా రక్షణ – మన చేతిలోనే ఉంటుంది.





