తెలుగు సినీ ప్రేక్షకులు భాషతో పని లేదు. కథ బాగుండి, వినోదం పంచితే ఎలాంటి అనువాద చిత్రాలనైనా ఆహ్వానిస్తారు. పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో అనువాద చిత్రాల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. ఈ ఏడాది తెలుగు తెరను తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు ఎంతగానో ఆకర్షించాయి. అయితే, వాటిలో కొన్ని విజయాలు సాధించగా, కొన్ని అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ ఏడాది మలయాళం, తమిళం చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలయాళ పీరియాడిక్ చిత్రాలు వేసవిలో మెరుపులు మెరిపించగా, ద్వితీయార్ధంలో తమిళ డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్‌పై తమ ముద్రవేశాయి.
వేసవిలో మలయాళం నుంచి వచ్చిన ‘భ్రమయుగం’ మమ్ముట్టి నటనతో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. అదే కాలంలో చిన్న సినిమాగా విడుదలైన ‘ప్రేమలు’ తెలుగు ప్రేక్షకుల చేత హిట్టు టాక్ సంపాదించింది. జూన్‌లో వచ్చిన విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ భిన్నమైన కథా తీరుతో పెద్ద విజయం సాధించింది. సెప్టెంబర్‌లో కార్తి నటించిన ‘సత్యం సుందరం’ కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. కన్నడ నుంచి వచ్చిన ‘బఘీరా’ భారీ అంచనాలతో వచ్చింది, కానీ ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది.
ఫ్లాపులు కూడా ఉన్నాయి
తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ భారీ బడ్జెట్‌తో వచ్చినా ఫ్లాపుగా మిగిలింది. నవంబరులో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ కూడా విఫలమైంది. ఇకపోతే.. మలయాళం నుంచి వచ్చిన చిన్న చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. మరో వైపు పాన్ ఇండియా ఫ్లాపులతో భారీ పెట్టుబడులు వృధా అయ్యాయి అనేది వాస్తవం!!





