నటి హనీ రోజ్ సోషల్ మీడియా వేధింపులపై పోలీసులను ఆశ్రయించి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సహించలేనంటూ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో హనీ రోజ్ ఓ పోస్ట్ చేశారు. సోమవారం కేరళలోని ఎర్నాకుళం పోలీసులు 27 మంది పై కేసులు నమోదు చేయగా, కుంబళం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పత్రికలు వెల్లడించాయి.
‘‘అలాంటి కామెంట్లపై యుద్ధం ప్రకటిస్తున్నా’’
‘‘వివరణాత్మక విమర్శలు, సరదా జోక్స్ నేను స్వాగతిస్తా. కానీ, అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నా. ఇది నాకోసం మాత్రమే కాదు, మహిళలందరి హక్కుల కోసం’’ అని హనీ రోజ్ స్పష్టం చేశారు. హనీ రోజ్ ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బందిపడుతున్నానని వెల్లడించారు. ఆ వ్యక్తి తన కార్యక్రమాలకు ఆమె రావడాన్ని నిరాకరించడంతో ప్రతీకార చర్యలకు దిగాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె హాజరవుతున్న ఈవెంట్లకు వచ్చి కించపరిచే వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని తెలిపారు. ‘వీరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హనీ రోజ్ ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తూ ఇతర మహిళలకు కూడా స్ఫూర్తిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.






