ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో కలిసి విశాఖలో రోడ్‌షో నిర్వహించి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
రైల్వే జోన్ కల సాకారం:
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ (దక్షిణ కోస్తా) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నిర్ణయించబడింది. 2019లో నాటి రైల్వే మంత్రి ప్రకటన చేసినప్పటికీ, ప్రాజెక్టు ఆలస్యమైంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావొచ్చని అంచనా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని అప్పగించడంతో రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. విశాఖ రైల్వే జోన్‌తో పాటు ప్రధాన హైవే ప్రాజెక్టులు, తిరుపతి జిల్లాలో క్రిస్‌సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు కూటమి పార్టీలు విస్తృత ఏర్పాట్లు చేయగా, ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి దిశగా కొత్త అవకాశాలు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






