ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టేందుకు రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో కీలక పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. చిరకాల కలగా ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చట్టంలోని కీలక అంశం. ఇది ఉత్తరాంధ్ర రవాణా, పారిశ్రామిక రంగానికి బలాన్ని చేకూరుస్తుంది. కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
క్రిస్సిటీ- పరిశ్రమల కేంద్రం:
తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ (క్రిస్సిటీ)కి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇది చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా రూపుదిద్దుకుంటుంది. రూ.37,500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న ఈ నగరం 4.67 లక్షల మందికి ఉపాధి కల్పించనుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టులు పారిశ్రామిక అభివృద్ధికి ఊపిరి పోయనున్నాయి. ఇది వైకాపా హయాంలో నెరపుకోలేకపోయిన పరిశ్రమలకు ప్రాణవాయువుగా మారనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు నేతలు పాల్గొనే విశాఖ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశను చూపనుండటంతో, కేంద్రం-రాష్ట్రం కలిసి అనేక రంగాల్లో పురోగతికి పునాది వేస్తున్నాయి.






