13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడుతున్న విరాట్ కోహ్లీని చూడేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఓ అభిమాని సెక్యూరిటీని దాటి కోహ్లీ ముందు నిలిచాడు.. సెల్ఫీ కోరడంతో భద్రతా సిబ్బంది అతడిని తొలగించారు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే అభిమానుల సందడి మామూలుగా ఉండదు. తాజాగా ఢిల్లీలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లీని చూడటానికి అరుణ్ జైట్లీ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉచితంగా టికెట్లు అందుబాటులోకి రావడంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అయితే ఈ ఉత్సాహంలో ఓ అభిమాని అనూహ్యంగా గ్రౌండ్‌లోకి ప్రవేశించడంతో సంచలనం నెలకొంది.
కోహ్లీ ముందు కాళ్ల మీద పడ్డ అభిమాని
సెక్యూరిటీని దాటి స్టేడియంలోకి ప్రవేశించిన ఓ యువకుడు విరాట్ కోహ్లీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. చేతిలో ఫోన్ పట్టుకొని కోహ్లీ కాళ్ల మీద పడి నమస్కారం చేశాడు. కోహ్లీ ఆపే ప్రయత్నం చేసినా ఆ యువకుడు సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి, అతడిని బయటకు తరలించారు. విరాట్ అభిమాని మీద కఠినంగా వ్యవహరించవద్దని కోరినప్పటికీ, సెక్యూరిటీ అతడిని స్టేడియం వెలుపలికి పంపింది. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






