రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రైతు భరోసా కూడా మోసమేనని విమర్శలు.. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు ప్రకటించారు..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో జహీరాబాద్ నియోజకవర్గ భారాస నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టుల పురోగతి లేకుండా పోయిందని, రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని పేర్కొన్నారు. “భారాస హయాంలో ఆదాయం ఏటా పెరిగినా.. ఇప్పుడు రూ.13 వేల కోట్లు తగ్గిందని కాగ్ నివేదిక చెబుతోంది. మరో నాలుగు నెలల్లో ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది” అని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనపై ఎండగడతాం
“విద్యుత్ కోతలు మొదలయ్యాయి, తాగునీరు సరఫరా సరిగ్గా లేదు. గురుకులాల్లో పురుగులన్నం పెడుతున్నారని తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి” అంటూ ఆయన మండిపడ్డారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రభుత్వంపై పోరాటం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ శక్తి ఏమిటో చూపించాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.






