ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి భారీ పరాజయం ఎదురైంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ కీలక స్థానాల్లో ఓడిపోవడం ఆప్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. భాజపా అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. అలాగే జంగ్పురలో మనీశ్ సిసోదియా భాజపా అభ్యర్థి తర్వీందర్‌సింగ్ చేతిలో 600 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. షాకుర్ బస్తీలో సత్యేందర్ జైన్ 19వేలకు పైగా ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ఇదిలా ఉండగా, దిల్లీ సీఎం ఆతిశీ మాత్రం కల్కాజీ స్థానం నుంచి విజయం సాధించారు. చివరి రౌండ్లో ముందంజలోకి వెళ్లి భాజపా అభ్యర్థి రమేశ్ బిధూరిపై 900 ఓట్ల తేడాతో గెలుపొందారు.





