రాష్ట్రంలో ఎన్నికల హామీలు నెరవేర్చని నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని, చంద్రబాబు మోసాలను బహిరంగంగా బయట పెట్టాలని వైఎస్ జగన్ పార్టీ నేతలకు ఆదేశించారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన జగన్, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రజల్లో మరింత మమేకం కావాలి
సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రభుత్వం వెనుకంజ వేసిందని, అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబు పాలనకు వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, నాయకత్వం సమష్టిగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మోసాలను వివరించాలని సూచించారు. ప్రతిరోజూ ప్రజల్లో మమేకమై, వారి సమస్యలను నేరుగా వినాలని, పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా ఉండాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అంబటి రాంబాబు, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, నందిగం సురేష్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.





