- గుంటూరు మిర్చియార్డు పరిసరాల్లో కల్తీ కారం ఉత్పత్తి బహిరంగ రహస్యంగా మారింది
- రసాయనాలతో కల్తీ చేసిన కారాన్ని హోటళ్లకు, రిటైల్ మార్కెట్‌కు సరఫరా
గుంటూరు మిర్చియార్డు పరిసరాల్లో కొన్ని మిల్లులు నాసిరకమైన కల్తీ కారం ఉత్పత్తి చేసి మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మిర్చి తొడిమలు, రంగుమారిన మిర్చి, తాలు, తుక్కు మిశ్రమంతో తయారైన కారం హోటళ్లు, క్యాటరింగ్, అల్పాహార కేంద్రాలకు అందిస్తున్నారు. తక్కువ ధరలో లభిస్తుండటంతో వ్యాపారులు దీన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. కల్తీ కారంలో మిర్చి తొడిమలు, రసాయనాలు, నూనెలు కలిపి తయారు చేస్తుండటంతో దీర్ఘకాలంలో ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీసే ప్రమాదముంది. ఎసిడిటీ, కాలేయ సమస్యలు, జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు కల్తీ ఆహార ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, బాధ్యులకు రూ. 5 లక్షల జరిమానా, జైలుశిక్ష విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.





