- రాయదుర్గం ఇంటి వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు
- వివాదాస్పద వ్యాఖ్యలపై పలు ప్రాంతాల్లో కేసులు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ భుజాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. సినీ పరిశ్రమపై పోసాని చేసిన విమర్శల కారణంగా ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు IPC 196, 353(2), 111 Red with 3(5) సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యహరించడంతో అతని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులకు ఇబ్బంది ఎదురైంది. గురువారం ఉదయానికి ఓబులవారిపల్లెకు తరలించి, రాజంపేట కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
అసభ్యకర వ్యాఖ్యలు – పలు ఫిర్యాదులు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోసాని ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి అనంతరం పోసాని రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినప్పటికీ, వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.





