- పొదుపు సంఘాల ఆధ్వర్యంలో 27 కంటైనర్ దుకాణాలు ప్రారంభం.
- మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా వ్యాపారులకు శుభవార్త. పొదుపు సంఘాల ఆధ్వర్యంలో 27 కంటైనర్ దుకాణాలను ప్రారంభించనున్నారు. డీఆర్డీఏ పరిధిలోని సెర్ప్ సంస్థ ఈ దుకాణాలను ఏర్పాటు చేస్తోంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఒక్కో దుకాణానికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తారు.
ఉపాధి అవకాశాలు
ప్రతి ఇంట్లో ఒకరిని పారిశ్రామికవేత్తను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులను వ్యాపార రంగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, వ్యాపార ప్రణాళికలు రూపొందించారు. టీ, కాఫీ, చిరుధాన్యాల ఉత్పత్తులతో పాటు పొదుపు సంఘాలు తయారు చేసే పిండి పదార్థాలు, గిరిజన ఉత్పత్తులను ఈ దుకాణాల్లో విక్రయిస్తారు. లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.






