వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ పేరు చర్చనీయాంశం… బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో మార్పులు చేసే అవకాశమన్న వార్తలు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పలు దేశాల ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతున్నారు. ఇప్పటికే స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం రిటైర్మెంట్ ప్రకటించగా, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక టీమ్‌ఇండియా నుంచి కూడా ఎవరైనా రిటైర్ అవుతారా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో ముమ్మరంగా సాగుతోంది. గత టీ20 ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో, వన్డేల్లోనూ రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతనే రోహిత్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, అతడి కెప్టెన్సీ కొనసాగింపు, సెంట్రల్ కాంట్రాక్ట్‌ల మార్పు వంటి అంశాలపై కూడా బోర్డు మేధోమథనం చేస్తోంది. వన్డే ఫార్మాట్‌లోనూ కీలక ఆటగాళ్లు తప్పుకుంటే, BCCI గ్రేడింగ్ విధానంలో మార్పులు తథ్యమని సమాచారం.





