టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మను భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా ప్రశంసలతో ముంచెత్తారు. అతని విధ్వంసకర బ్యాటింగ్ జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అందిస్తుందని అభిప్రాయపడ్డారు. జియో సినిమా షోలో మాట్లాడుతూ అభిషేక్ హై-రిస్క్ బ్యాటర్‌గా, ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్‌గా తనదైన ముద్ర వేశాడని చావ్లా పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగులు సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు ఉండడం విశేషం. అంతకుముందు, టీమిండియా బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను 132 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా విజయం: అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్
లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయడం జట్టు విజయంలో కీలకమైంది. చివరకు 12.5 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ శర్మ ఆటతీరు భవిష్యత్తులో కూడా టీమిండియాకు విజయాలను అందిస్తుందని పీయూష్ చావ్లా చెప్పుకొచ్చారు.






