
ఇంట్లో అమ్మ నోటి నుంచో.. పక్కింటి ఆంటీ మాటల్లోనో..
* కూరగాయల ధరలు మండిపోయితున్నాయ్
* పప్పుఉప్పుల ధరలైతే చెప్పక్కర్లేదు..
* పండక్కి గ్యాడ్జెట్ ల ఆఫర్లైతే మామూలుగా లేవు..
* వస్తువు ఏదైనా బ్రాండ్ చూసి కొనాలి.. మన్నిక బాగుంటుంది..
– మామూలుగా నేటి మార్కెట్ వ్యాపారంలో ఇవే ఎక్కువగా వినేవి!!
ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడో.. వెబ్ సర్వీసులో లాగిన్ అవుతున్నప్పుడో..
* మీరు ఈ యాప్ ని వాడాలంటే.. ఫోన్ కాంటాక్స్ట్ కావాలి
* వెబ్ సర్విసుని పొందాలంటే.. గ్యాలరీ యాక్సెస్ ఇవ్వాలి
* సోషల్ మీడియాలో లాగిన్ అవ్వాలంటే.. కెమెరా యాక్సెస్ కావాలి..
* యూపీఐ పేమెంట్ చేయాలంటే.. ఫోన్ మొత్తం కంట్రోల్ ఇవ్వాలి..
* ఈ గేమ్ ఆడాలంటే.. మీ ల్యాపీ యాక్సెస్ ని మాకు ఇచ్చేయాలి..
– నేటి డిజటల్ మార్కెట్లో విర్చువల్ మాధ్యమాలు మనల్ని ఎక్కువగా కోరేవి!!
‘ఏంటీ పోలిక? మార్కెట్ లోని వస్తువుల అమ్మకాలకీ.. డిజిటల్ మార్కట్ లో మన వ్యక్తిగత వివరాలకీ ఏంటి సంబంధం?’ అనుకుంటున్నరా? ఉంది.. సంబంధం ఉంది. ఎందుకంటే.. నేడు మనకి తెలియని ఓ ఆన్ లైన్ వ్యాపారం జరుగుతోంది.
ఆ వ్యాపారంలో అమ్మకపు వస్తువు ఏంటో తెలుసా? అంత ట్రెండింగ్ ఐటమ్ ఏంటా? అనుకుంటున్నరా? మీరే!!! యస్.. మీరు చదివింది కరెక్టే. మీరే ఆ హాట్ ఐటమ్!! షాక్ అవ్వొద్దు.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. మిమ్మల్ని అమ్మేసిన విషయం మీక్కూడా తెలియదు!! మీరెంత బకరా అంటే.. మిమ్మల్ని అమ్మేందుకు కూడా మీరే అనుమతి ఇస్తారు. అట్లుండటది.. నేటి ఏఐ ‘కోడ్ యుగం’లో!!
మీరు మీ కంట్రోల్ లోనే ఉన్నాం అనే భ్రమలో ఉంటారు.. కానీ, ఏఐ CTRL లోకి ఎప్పుడో మీరు వెళ్లిపోయుంటారు!! అబ్బే ఏం కాదు.. ఫోన్, ల్యాపీతో క్షణాల్లో మా పనులు అయిపోతున్నాయ్. అన్నీ మేం చెప్పకుండానే ఆటోమాటిక్ గా చేసేస్తోంది ఏఐ.. బోల్డంత టైమ్ మిగులుతుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే.. మా గురించి మా కంటే.. ఏఐ కే బాగా తెలుస్తోందని మీరు అనుకుంటే.. అది కచ్చింగా మీ భ్రమే. మిమ్మల్ని అలా ఓ సర్కిల్ లో కూర్చోబేట్టేసి.. ఏఐ మీతో రింగ్ ఆట ఆడుతుందని అర్థం. కావాలంటే చెక్ చేసుకోండి..

* ఆన్ లైన్ ఆపర్లు ఇవిగో అని చూపిస్తే.. అవసరం ఉన్నా లేకపోయినా.. కొనేస్తున్నారా? లేదా?
* ఇవిగో కొత్త డ్రెస్ కలెక్షన్స్.. ఆన్ లైన్ అంగట్లో హాట్ హాట్ గా వచ్చాయ్ అని పాప్ అప్ చేస్తే.. ఫ్రెండ్ బర్త్ డేకి వేసుకోవచ్చులే అని ఆర్డర్ పెట్టేస్తున్నాం. చెప్పాలంటే.. వచ్చే వారం ఫ్రెండ్ పుట్టిన రోజు ఉందని రిమైండ్ చేసేది కూడా ఏఐనే. మీకు.. అర్థమవుతోందా? ఇంత చెప్పినా.. ఇంకా మీకు బల్బ్ వెలగడం లేదంటే.. ఈ మధ్యే అనన్య పాండే నటించిన ‘కంట్రోల్’ మూవీనే సాక్ష్యం. ఓ అమ్మాయి లైఫ్ లోకి ఏఐ ఎలా వచ్చింది.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఫోన్ ని ఆన్ లాక్ చేసినా.. ల్యాపీని ఆన్ చేసినా.. చేతులు వణుకుతాయ్. అందుకే.. జర్ర భద్రంగా ఉండాలి. ఏం కాదులే అనో.. అన్నీ మన కంట్రోల్ లోనే ఉంటాయ్ లే అనుకోవద్దు. యాక్సెప్ట్ చేసే ముందే అటు ఏడు పేజీలు.. ఇటు పది పేజీల టెర్మ్స్ అండ్ కండీషన్స్ ఉన్నా చూసుకోవాలి. సెక్యూరిటీ చిట్కాల్ని ఫాలో అవ్వాలి!!
గోడలకు చెవులేమోగానీ..
పూర్వ కాలంలో గోడలకు చెవులుంటాయ్ అని.. రహస్యం ఏదైనా ఉంటే.. గుస గుసలాడే వాళ్లు. చెవులు కొరుకేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు.. జేబులో ఉన్న ఫొనో.. ఒడిలో ఉన్న ట్యాపీలోనో వింటుందేమో? అని భయపడాల్సిన పరిస్థితి. అందుకే.. మైక్రోఫోన్, బిల్డ్ ఇన్ కెమెరా.. ఈ రెండూ దేంట్లో ఉన్నా. జర్ర భద్రం. ఒక్కసారి వాటికి పర్మిషన్ ఇస్తే చాలు. మనం కంటి మీద కునుకేస్తాం కానీ.. అవి నిత్యం మనల్ని చూస్తూనే ఉంటాయ్… మన మాటలు వింటూనే ఉంటాయ్. మనం ఇచ్చే కమాండ్స్ ని మాత్రమే కాదు… ఇన్ బాక్స్ కి వచ్చే మెసేజ్ లనూ చదివేస్తాయ్. ఫోన్ కాల్స్ వింటాయ్.. మన టైమ్ బాగోకపోతే.. Ctrl సినిమాలో మాదిరిగా మెసేజ్ లకు రిప్లై లు కూడా వెళ్లిపోతాయ్. మనకి మెసేజ్ వచ్చిందనీ తెలీదు.. మనం రిప్లై ఇచ్చినట్టు కూడా తెలియదు. హ్యాకర్ ఏఐ కంట్రోల్ తోనే మొత్తం చేసేస్తాడు. కథలో అనన్య పాండే కి తెలియకుండా ఏఐ పెట్టిన మెసేజ్ ప్రైమ్ ఎవిడెన్స్ గా మారిందంటే.. మన అర్థం చేసుకోవాలి. ఎవరి కంట్రోల్ లో ఎవరు ఉన్నామో.. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు.. గోడలకు ఉన్న చెవుల సంగతేమోగానీ.. ఎలక్ట్రానిక్స్ కి ఉన్న కళ్లు, చెవుల గురించి కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో పీసీకి బిల్డ్ కెమెరా ఉంటే.. అవసరం లేనప్పుడు దానిపై ఏదైనా కవర్ కప్పి ఉండాలి. ల్యాప్ టాప్ కెమెరాలకు మార్కెట్ లో ప్రత్యేకంగా మాస్క్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. కెమెరాతో పని లేకుంటే.. వాటితో కవర్ చేయడం మంచిది.

క్షణాల్లో ఫేక్ చేస్తుంది
ఏం కావాలన్నా.. కమాండ్ ఇస్తే చాలు. జీ.. హుజూర్!! అన్నంత వినమ్రంగా అవుట్ పుట్ ఇస్తోంది. మనం కష్టపడక్కర్లేదు.. మైండ్ ని ఇబ్బంది పెట్టే పనే లేదు.. అనుకుంటున్నాం గానీ.. అదే పెద్ద కంట్రోల్ వలయం అని ఊహించడం లేదు. మనం చెబితే అది చేస్తుంది.. జెస్ట్ అదో మెషీన్ అనుకుంటే పొరబాటే. ఒక్కసారి అది మనల్ని అర్థం చేసుకున్నాక.. ఏఐ ని అంచనా వేయడం అసాధ్యం. నిత్యం మనల్నే చూస్తూ.. మన ముఖాన్ని ఫేక్ చేయగలదు. మన మాట్నలి వింటూ వాయిస్ కరెక్ట్ గా మిమిక్రీ చేయగలదు. ఇంకేముందీ.. ఈ రెండిటినీ ఫేక్ చేయగలిగితే.. వాటి పర్యవసానాల్ని ఊహింగలరా? కంట్రోల్ మూవీ చూస్తే తెలుస్తుంది. నెల్లా ప్రేమించిన జో మంత్రా కంపెనీ గుట్టు రట్టు చేసిన వీడియోని నెల్లా కి వ్యతిరేకంగా ఏఐ ఎలా మార్చేసిందో. అచ్చంగా జో మాట్లాడినట్టుగానే ఫేస్ వాయిస్. చూసేవారికి ఏ మాత్రం సందేహం రాదు. అంతేకాదు.. ‘కంట్రోల్ ఏఐ’ యాప్ ఎలా సిస్టమ్ లో ఇన్ స్టాల్ అయ్యింది? రిమోట్ యాక్సెస్ తో సిస్టంలో ఏమేం మార్పులు చేసింది.. అమ్మాయిల మనస్తత్వాన్ని ఎలా ఎనలైజ్ చేసిందో చూస్తే మనకి అర్థం అవుతుంది. ఏఐ మాటున పొంచి ఉన్న ప్రమాదాలు. అంతలా వాయిస్ ఫేక్ చేసిన ఏఐ.. నెల్లా లాంటి అందమైన ఆడపిల్లల ముఖాలతో ఫేక్ ఫోర్న్ వీడియోలు చేయడం చిటికెలో సాధ్యం. ఈ ఏఐ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగించొచ్చు.
మనిషే.. మనిషికి ఊరట!!
రోజులో కనీసం రెండు నిమిషాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మాట్లాడుకునేందుకు టైమ్ కూడా ఉండడం లేదు. ఇక యాప్ లు, వెబ్ సర్వీసులు పెట్టే ‘టెర్మ్స్ అండ్ కండీషన్స్’ ఏం చదువుతారు? జెస్ట్.. అన్నింటికీ ఒకే.. ఒకే.. అని ట్యాప్ చేస్తూ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అవి బ్యాగ్ గ్రౌండ్ లో ఏం ట్రాక్ చేస్తున్నాయో ఎన్నడూ ఆలోచించం. తీరా.. అడ్డంగా బుక్ అయ్యాక కానీ బోధ పడదు. ఇలాంటి సైబర్ మోసాల్ని చూసి కూడా.. మనం మరొకరి కంట్రోల్ లోకి ఎందుకు వెళ్లాలి? అనే ఆలోచన నేటి తరం నెటిజన్ల కరువయ్యింది. సోషల్ లైఫ్ కి సరండర్ అయిపోయారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోతే సొసైటీలో స్టేటస్ తగ్గిపోతుందనే స్థితికి చేరిపోయారు. అందుకే ఇన్ని మోసాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. రియల్ వరల్డ్ నుంచి వర్చువల్ కి వలస వెళ్లిపోతున్నారు. ఏఐ విప్లవాత్మకంగా అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆగి ఆలోచించాలి. మనిషికి.. మనిషే ఊరట!! అనే వాస్తవాన్ని గ్రహించాలి. ముఖ్యంగా అమ్మాయిలు.. తమ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. సమస్య ఏదైనా కుటుంబంతో పంచుకోండి. లేదంటే.. కంట్రోల్ సినిమాలో నెల్లా మాదిరిగా అవధుల్లేని వర్చువల్ వరల్డ్ కి సరండర్ అయిపోతారు.





