అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటనపై అప్‌డేట్స్ వెల్లడయ్యాయి. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 242 మంది (230 ప్రయాణికులు, 12 సిబ్బంది) ఉన్నారు. మధ్యాహ్నం 1:47 గంటలకు టేకాఫ్ అయిన 9 నిమిషాలకే మేఘనీనగర్‌లోని షాహీబాగ్ సమీపంలో విమానం కూలింది. ఎయిర్ ఇండియా చైర్మన్ N చంద్రశేఖరన్ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ, “బాధిత కుటుంబాలకు సహాయం అందించడమే మా ప్రాధాన్యత. ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేశాము, సమాచారం కోసం సపోర్ట్ టీమ్స్ సిద్ధం,” అని తెలిపారు.
బాధిత కుటుంబాలకు సహాయం మా ప్రాధాన్యత, ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు: చంద్రశేఖరన్
గుజరాత్ CM భూపేంద్ర పటేల్ రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. “గాయపడినవారికి వెంటనే చికిత్స, గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలి,” అని సూచించారు. NDRF 90 మంది సిబ్బందితో ఆరు టీమ్‌లను (గాంధీనగర్, వడోదర నుంచి) సంఘటనా స్థలానికి పంపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ అధికారులతో మాట్లాడి, కేంద్ర సహాయం హామీ ఇచ్చారు. స్థానికంగా దట్టమైన పొగలు, శిథిలాలు కనిపించడంతో భయాందోళన నెలకొంది. గాయపడినవారి స్థితి, హతమైనవారి సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్ ఇండియా తదుపరి అప్‌డేట్స్ ఎక్స్‌లో ఇస్తామని పేర్కొంది. దర్యాప్తు, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.





