- ఓపెన్‌ఏఐ, రెట్రో బయోసైన్సెస్ సంయుక్తంగా ఏఐ సహాయంతో వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
- వృద్ధ కణాలను తిరిగి యవ్వనంగా మార్చే కొత్త ప్రొటీన్‌లను ఏఐ సృష్టించింది.
- ఈ ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మానవ ఆయుష్షును పెంచడానికి ఉపయోగపడుతుంది.
మనం ఎప్పటికీ యువకులుగా, తాజాగా ఉండాలని కోరుకుంటాం. అయితే, వయసు పెరిగే కొద్దీ అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వయసును తగ్గించే రోజులు దగ్గర పడుతున్నాయి. టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐ, బయోటెక్నాలజీ సంస్థ రెట్రో బయోసైన్సెస్ కలిసి ఈ దిశలో ఒక కీలకమైన అడుగు వేశాయి. వృద్ధాప్య కణాలను తిరిగి యవ్వనంగా మార్చే కొత్త టెక్నాలజీని ఈ సంస్థలు అభివృద్ధి చేశాయి.
కొత్త ప్రొటీన్‌ల తయారీ..
మానవ ఆయుష్షును పెంచే పరిశోధనలకు ఈ ఆవిష్కరణ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రెండు సంస్థలు కలిసి జీపీటీ-4బీ మైక్రో అనే ప్రత్యేక ఏఐ మోడల్‌ను రూపొందించాయి. ఇది సాధారణ ఏఐ చాట్‌బాట్‌లా కాకుండా, కేవలం జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందింది. ముఖ్యంగా ప్రొటీన్‌ల నిర్మాణం, 3డీ మాలిక్యులర్ స్ట్రక్చర్లు, బయోసైన్స్ డేటాను పరిశీలించేలా దీన్ని ట్రైన్ చేశారు. పునరుత్పత్తి వైద్యానికి అవసరమైన కొత్త ప్రొటీన్‌లను సృష్టించడమే దీని ప్రధాన లక్ష్యం.
అద్భుత ఫలితాలు..
ఈ ఏఐ సహాయంతో శాస్త్రవేత్తలు ఇప్పటికే నోబెల్ బహుమతి పొందిన ‘యమనక ఫ్యాక్టర్స్’ అనే ప్రొటీన్‌లను మెరుగుపరిచారు. సాధారణంగా ఈ ప్రొటీన్‌లు వయోజన కణాలను తిరిగి స్టెమ్ సెల్స్‌గా మారుస్తాయి. కానీ ఏఐ రూపొందించిన కొత్త వెర్షన్ ప్రొటీన్‌లు ల్యాబ్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు చూపించాయి. పాత యమనక ఫ్యాక్టర్స్‌తో పోలిస్తే, ఏఐ సృష్టించిన ప్రొటీన్‌లకు గురైన కణాలు 50 రెట్లు వేగంగా, మరింత సమర్థవంతంగా యవ్వన లక్షణాలను తిరిగి పొందాయి. అంతేకాకుండా, డీఎన్‌ఏలో జరిగిన నష్టాన్ని కూడా ఇవి చాలా వేగంగా సరిచేశాయి. ఈ పరిశోధనల గురించి ఓపెన్‌ఏఐ తమ బ్లాగ్‌పోస్ట్‌లో మాట్లాడుతూ.. “జీపీటీ-4బీ మైక్రో సహాయంతో యమనక ఫ్యాక్టర్స్‌లో గణనీయమైన మెరుగుదల సాధించాం. స్టెమ్ సెల్స్‌ను రీప్రోగ్రామ్ చేసే మార్కర్‌లను సాధారణ నియంత్రణలతో పోలిస్తే 50 రెట్లు అధికంగా ఇవి ప్రభావితం చేశాయి” అని చెప్పింది. ఈ పరిశోధనలు వృద్ధాప్యానికి ముగింపు పలికేలా కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.





