- 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో మూడో అతిపెద్ద విగ్రహం
- ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభోత్సవం
ఆదియోగి విగ్రహం అంటే తరచుగా తమిళనాడు కోయంబత్తూరు, కర్ణాటక బెంగళూరు విగ్రహాలు గుర్తుకు వస్తాయి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఆదియోగి విగ్రహం భక్తులకు అందుబాటులోకి రానుంది. కోనసీమ జిల్లా, మండపేట మండలం ద్వారపూడి అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. కర్ణాటక, తమిళనాడులోని 112 అడుగుల విగ్రహాల తర్వాత ఇది మూడో అతిపెద్ద విగ్రహంగా నిలవనుంది.
శివరాత్రి రోజున ప్రతిష్ఠాపన
ఈనెల 26న మహాశివరాత్రి రోజున ఉదయం 5.30 గంటలకు విగ్రహం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విగ్రహం వెనుకభాగంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి, ధ్యానానికి అనుకూలంగా తీర్చిదిద్దారు. అలాగే, వినాయకుడు, కుమారస్వామి నమస్కరిస్తున్నట్లు, మహర్షులు ధ్యానం చేస్తున్నట్లు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే అర్ధనారీశ్వరుడు, నటరాజుడు, నంది తదితర విగ్రహాలున్నాయి.





